Engineering courses in local languages: జేఈఈ (మెయిన్స్) పరీక్షలను హిందీ, ఇంగ్లీష్‌తో పాటు మరో తొమ్మిది ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గత నెలలో ప్రకటించింది. వచ్చే సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది
జేఈఈ (మెయిన్స్) పరీక్షలను హిందీ, ఇంగ్లీష్‌తో పాటు మరో తొమ్మిది ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గత నెలలో ప్రకటించింది. వచ్చే సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. జేఈఈ (అడ్వాన్స్డ్) పరీక్షను కూడా ఇలానే నిర్వహిస్తారా లేదా అనే అంశంపై ఐఐటీలు ఇంకా స్పందించలేదు. సాంకేతిక విద్యను ప్రాంతీయ భాషల్లో బోధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లలో మాతృభాషల్లో ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తామని కేంద్ర విద్యాశాఖ అధికారులు తెలిపారు. గురువారం కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. "సాంకేతిక విద్యను, ముఖ్యంగా ఇంజనీరింగ్ కోర్సులను ప్రారంభించడం, మాతృభాషలో పాఠాలు చెప్పడం వంటి అంశాలపై తుది నిర్ణయం తీసుకున్నాం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తాయి. ముందు కొన్ని ఐఐటిలు, ఎన్ఐటిల్లో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తాం" అని మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
పోటీ పరీక్షలన్నీ NTA ఆధ్వర్యంలోనే
ఈ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ద్వారా పోటీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డుల ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసిన తరువాత, పోటీ పరీక్షల కోసం సిలబస్‌ను రూపొందించాలని అధికారులు నిర్ణయించారు. "అన్ని స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు సకాలంలో పంపిణీ చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కు సూచించాం. ఇందుకు ప్రత్యేకంగా ఒక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాలని చెప్పాం. విద్యార్థులు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలని యూజీసీని ఆదేశించాం" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ అధికారి తెలిపారు.
ఆ పరీక్షలు కూడా
జేఈఈ (మెయిన్స్) పరీక్షలను హిందీ, ఇంగ్లీష్‌తో పాటు మరో తొమ్మిది ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గత నెలలో ప్రకటించింది. వచ్చే సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. జేఈఈ (అడ్వాన్స్డ్) పరీక్షను కూడా ఇలానే నిర్వహిస్తారా లేదా అనే అంశంపై ఐఐటీలు ఇంకా స్పందించలేదు. దీనికి ముందు సిలబస్‌పై ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోవిడ్-19 నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం పాఠశాలలు, కాలేజీలను పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు. ఆన్‌లైన్ క్లాసుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులపై భారం పడకుండా CBSE, CISCE వంటి జాతీయ బోర్డులతో పాటు ఇతర రాష్ట్రాల ఎడ్యుకేషన్ బోర్డులు కూడా ఈ సంవత్సరం సిలబస్‌ను తగ్గించాయి. దీంతో విద్యార్థులు నష్టపోకుండా, ముందు ఉమ్మడి సిలబస్‌పై ఒక అంచనాకు వచ్చిన తరువాతే పరీక్షలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.