Cyclone Nivar
Cyclone Nivar: నివర్ ఎఫెక్ట్.. బంగాళాఖాతంలో మరో రెండు తుపాన్‌లు ఏర్పడే అవకాశం
నివర్ తుపాన్ ప్రభావంతో తమిళనాడు, పుదచ్చేరితో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే
నివర్ తుపాన్ ప్రభావంతో తమిళనాడు, పుదచ్చేరితో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల వృక్షాలు నెలకొరిగాయి. తీరం దాటిన తర్వాత నివర్.. తీవ్ర తుపాన్‌గా మారిందని వెల్లడించింది. అయితే ఈ తుపాన్ ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ తుపాన్ ప్రభావం తెరుకోక ముందే.. బంగాళాఖాతంలో మరో రెండు తుపాన్‌లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హచ్చరించారు. నివర్ తుపాన్ కారణంగా రెండు తుపాన్‌లు ఏర్పడనున్నాయని పేర్కొన్నారు. వారం రోజుల వ్యవధిలో ఇవి ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు.
తొలుత దక్షిణ బంగాళాఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది బలపడి డిసెంబర్ 1వ తేదీన తుపాన్‌గా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తమిళనాడు తీర ప్రాంతంలో ఈ తుపాన్ తీరం దాటుతుందని భావిస్తున్నారు. మరోవైపు డిసెంబర్ మొదటి వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పుడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య పుదుచ్చేరి తీరానికి సమీపంలో నివర్ తుపాన్ తీరం దాటినట్టుగా భారత వాతావరణ శాఖ పేర్కొంది. నివర్ తుపాన్ అతి తీవ్ర తుపాన్ నుంచి తీవ్ర తుపాన్‌గా బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలహీనపడి నేటి సాయంకాలానికి వాయుగుండంగా మార్పు చెందనున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఏపీలో నివర్ తుపాను ప్రభావం నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై అధికంగా ఉంది. తుపాను కారణంగా నెల్లూరు, తడ, సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, వాకాడు, కోట, మనుబోలు, ముత్తుకూరు, కావలిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. జిల్లాలోని 1600 చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి.
తుపాన్ ప్రభావంతో తిరుమలలో కూడా భారీ వర్షం కురుస్తోంది. దీంతో తిరుమలలోని జలాశయాలు అన్ని నిండాయి. ఈ క్రమంలో అధికారులు పాపవినాశనం, గోగర్భం జలాశయాల గేట్లను ఎత్తారు. మరోవైపు తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్నాయి. రెండో ఘాట్ రోడ్ హరిణి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి.
Thanks for reading Cyclone Nivar